Jayam Ravi: భార్య‌కు విడాకులిచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో

Tamil actor Jayam Ravi and wife Aarti announce separation

  • భార్య ఆర్తితో విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌యం ర‌వి
  • 2009లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన జంట‌
  • 15 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వ‌స్తి
  • ఈ దంప‌త‌ులకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తాజాగా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సంచలన ప్రకటన చేసి, అభిమానుల‌కు షాకిచ్చారు. తన భార్య‌ ఆర్తితో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ దంప‌తులు విడాకులు తీసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ జ‌యం ర‌వి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. 

అలాగే తాము ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఆయ‌న త‌న ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ జంట 2009లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. దాదాపు 15 ఏళ్ల పాటు ర‌వి, ఆర్తి త‌మ‌ వైవాహిక జీవితాన్ని గడిపారు. ఈ దంప‌త‌లకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

'ఎక్స్‌'లో జ‌యం ర‌వి పోస్ట్ చేసిన లేఖ‌లో ఏముందంటే..

"జీవితం చాలా అధ్యాయాలతో నిండిన ఒక‌ ప్రయాణంలాంటిది. ఇందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీలో చాలామంది నన్ను ఆదరించారు. అలాగే నాకు స‌పోర్ట్ కూడా చేశారు. అందుకే నేనెప్పుడు నా ఫ్యాన్స్‌, మీడియాతో నిజాయతీగా ఉంటాను. 

ఈ నేప‌థ్యంలోనే ఇవాళ‌ మీతో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నాను. భారమైన హృదయంతో ఈ విషయాన్ని మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల‌ తర్వాత నేను, నా భార్య‌ ఆర్తి డైవోర్స్‌ తీసుకోవాలనే కఠినమైన నిర్ణయానికి వ‌చ్చాం. 

మేము ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. మా ఇద్దరి భ‌విష్య‌త్ కోస‌మే కోసమే ఇలా చేయాల్సి వ‌స్తోంది. ఈ సమయంలో మాతో పాటు మా కుటుంబసభ్యుల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ విష‌యంపై పుకార్లు, ఆరోపణలు మానేయాలని మ‌న‌వి చేస్తున్నాను. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. 

నేను సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. చిత్రాల‌ విషయంలో నా ప్రాధాన్యం ఎప్పుడూ ఇలాగే కొన‌సాగుతుంది. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం నేను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఇక‌పై కూడా మీరు ఇలానే మద్దతుగా ఉంటార‌ని ఆశిస్తున్నాను" అంటూ జయం రవి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

More Telugu News