IMD: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Another Low pressure Area in Bay of Bengal

  • ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం
  • గంటకు 10 కి.మీ. వేగంతో కదులుతోందన్న ఐఎండీ
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10 కి.మీ. వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు.

భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయని, వాయుగుండం ప్రభావంతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్ లలో ప్రయాణించవద్దని వాహనదారులను హెచ్చరించారు. పలు ఘాట్ రోడ్ లలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IMD
Low Pressure
Bay Of Bengal
Telugu States
Heavy Rains

More Telugu News