Vinayaka Mandapam: కీసరలో వినాయకుడి లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగలు.. వైరల్ వీడియో!

Laddu Theft From Vinayaka Mandapam In Kesara

--


గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ వినాయక మంటపంలో దొంగతనం జరిగింది. ఐదుగురు యువకులు అర్ధరాత్రి మంటపంలోకి ప్రవేశించి బొజ్జ గణపయ్య చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లారు. దీనిపై మంటపం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీ వాసులు వినాయక మంటపం ఏర్పాటు చేసి గణపతిని ప్రతిష్టించారు. ఆదివారం రాత్రి రోజువారీ పూజలు, భజనలు చేశాక భక్తులతో పాటూ నిర్వాహకులు కూడా ఇళ్లకు వెళ్లిపోయారు. మంటపంలోని వినాయకుడి విగ్రహానికి ఓ పరదా వేశారు. అర్ధరాత్రి ప్రాంతంలో ఐదుగురు యువకులు అక్కడికి చేరుకుని, మంటపంలోకి వెళ్లారు. ఓ యువకుడు లోపలికి వెళ్లి వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూను కాజేశాడు. 

లడ్డూను తీసుకుని యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. తెల్లవారి మంటపం దగ్గరికి వచ్చిన నిర్వాహకులు వినాయకుడి చేతిలో లడ్డూ మాయమవడం గుర్తించి సీసీటీవీ ఫుటేజీలో చెక్ చేశారు. దీంతో యువకులు చేసిన దొంగతనం బయటపడింది. ఈ చోరీ ఘటనపై వినాయక మంటపం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News