Pawan Kalyan: మెగా డాటర్ నిహారికకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు
- ఏపీకి రూ. 5లక్షల విరాళం ప్రకటించిన నాగబాబు తనయ నిహారిక
- కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చిందన్న పవన్
- కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించిన మెగా డాటర్
- ఇలాగే నిర్మాతగా నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన జనసేనాని
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలు ఆపన్నహస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన నేత, నటుడు నాగేంద్రబాబు కుమార్తె కొణిదెల నిహారిక తనవంతు సాయంగా ఏపీకి రూ. 5లక్షల విరాళం ప్రకటించారు.
దాంతో ఆమె మంచి మనసును మెచ్చుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. అలాగే నిహారిక ఇటీవల కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించినందుకుగాను జనసేనాని శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు.
"ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి రూ. 50వేల చొప్పున 10 గ్రామాలకు రూ. 5లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిర్మాతగా మంచి విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.