Moving Vinayaka: నెల్లూరు భక్తులను ఆశీర్వదిస్తున్న కదిలే వినాయకుడు.. వీడియో ఇదిగో!
నెల్లూరులో కదిలే వినాయకుడు భక్తులను చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాడు. కళ్లు ఆర్పుతూ, చేయి కదిలిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బొజ్జ గణపయ్య తన భక్తులను ఆశీర్వదిస్తున్న ఈ దృశ్యం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మండపం వద్దకు వస్తున్నారు. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి వినాయకుడి ఆశీర్వాదం తీసుకుని వెళుతున్నారు.
36 వేల ముత్యాలతో విగ్రహం..
వినాయక చవితి వేడుకలను నిర్వహించడంలో ఇనమడుగు మిక్సెడ్ కాలనీకి చెందిన ఠాగూర్ టీమ్ ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది. గత పదేళ్లుగా ఏటా వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఈసారి 36 వేల ముత్యాలతో 13 అడుగుల ఎత్తుతో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. కళ్లు ఆర్పుతూ, చుట్టూ చూస్తూ చెయ్యెత్తి భక్తులను ఆశీర్వదించడం ఈ విగ్రహం ప్రత్యేకత. దీని తయారీ కోసం దాదాపు నెల రోజులు శ్రమించామని, రూ.1.50 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు చెప్పారు. ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించాక విగ్రహంలోని ముత్యాలను భక్తులకు పంచిపెడతామని వివరించారు.