Rahul Gandhi: అమెరికాలో రాహుల్‌గాంధీకి ఆత్మీయ స్వాగతం

Rahul Gandhi Gets Warm Welcome In Dallas

  • మూడు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత
  • డలాస్‌లో ప్రవాస భారతీయులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల ఘన స్వాగతం
  • రేపు, ఎల్లుండి వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటన

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని డల్లాస్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు భారతీయ ప్రవాసులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐవోసీ) సభ్యులు ఆయనకు ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ ఫొటోలను షేర్ చేసిన రాహుల్.. డల్లాస్‌లో తనకు ఆత్మీయ స్వాగతం లభించినందుకు సంతోషిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే అర్థవంతమైన చర్చలు, అంతర్ దృష్టితో కూడిన సంభాషణల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. నేడు డల్లాస్‌లో ఉండనున్న రాహుల్ రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారు. అంతకుముందు రాహుల్ పర్యటనపై ఐవోసీ చీప్ శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మీడియా, రాజకీయ నాయకులతో సహా భారతీయ ప్రవాసులు రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఉన్నారని, చర్చల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

More Telugu News