YSRCP: జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్
- ప్రభుత్వాన్ని విమరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ట్వీట్
- వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని జగన్ విమర్శలు
- జగన్ విమర్శలకు నటుడు బ్రహ్మాజీ స్పందిస్తూ వ్యంగ్యంగా ట్వీట్
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఇళ్లు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు జగ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా బుడమేరు వరద నీరు విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార యంత్రాంగం, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడకు వరద ముంచెత్తిననాటి నుండి సీఎం చంద్రబాబు ..ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే తన తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అధికార యంత్రాంగంతో వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ .. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని జగన్ ఆరోపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
దీనిపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనిపించడం లేదా అంటూ కూటమి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, రాజకీయంగా ఆడే ఆట కాదు, ఇది ప్రజల జీవితం, సోషల్ మీడియాలో విమర్శలు మాని, ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ కామెంట్స్ పెట్టారు. మరో పక్క జగన్ ట్వీట్ పై సినీ నటుడు బ్రాహ్మాజీ స్పందిస్తూ తనదైన శైలిలో ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. ‘మీరు కరెక్టు సార్.. వాళ్లు చేయ్యలేరు..ఇక నుండి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా’ అంటూ బ్రహ్మాజీ పోస్టు పెట్టారు.