Kharatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy first puja at Khairatabad Ganesh

  • ఉత్సవాలను కమిటీ గొప్పగా నిర్వహిస్తోందన్న ముఖ్యమంత్రి
  • భాగ్యనగరంలో లక్షా 40 వేల విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
  • గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించామన్న సీఎం

ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకొని తొలిపూజలు చేశారు. గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ తదితరులు గణేశుడిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మన దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలను కమిటీ నిర్వహిస్తోందన్నారు. ఏడు దశాబ్దాలుగా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ఉత్సవాలను తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, అందుకే ఉత్సవ కమిటీ సమస్యలను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు.

భాగ్యనగరంలో లక్షా 40 వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారని వెల్లడించారు. గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిందన్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం నెలకొందని... అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఈరోజు సీఎంగా గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నట్లు చెప్పారు.

More Telugu News