Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు

AP Minister Kollu Ravindra Comments On Prakasham Barriage Boats Incident

  • బోట్లు అన్నీ ఒకే రంగులో ఉండడంపై మంత్రి కొల్లు రవీంద్ర అనుమానం
  • విచారణ జరుపుతున్నామని వెల్లడించిన మంత్రి
  • కుట్ర అని తేలితే ఎవరున్నా విడిచిపెట్టబోమని వ్యాఖ్య

వరదలో కొట్టుకువచ్చిన బోట్లు ఇటీవల ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఒకదాని వెనక మరొకటిగా మొత్తం నాలుగు బోట్లు వేగంగా వచ్చి బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయి. దీంతో బ్యారేజీలో 67, 69 నెంబరు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. 

తాజాగా ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా వరదలో కొట్టుకు వచ్చిన నాలుగు బోట్లు కూడా ఒకే రంగులో ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు.

ఈమేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీని బోట్లతో డ్యామేజ్ చేయాలని చూశారని ఆరోపించారు. ఒకే రంగులో ఒకే రకమైన బోట్లు కొట్టుకురావడం వెనక కుట్ర ఉందన్నారు. అధికారులు ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించారని వివరించారు. ఒకవేళ ఈ ఘటన వెనక కుట్ర ఉందని తేలితే మాత్రం కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పండగపూట కూడా ప్రజల్లోనే సీఎం...

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వినాయక చవితి పండగ ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి పండగ రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్యే ఉన్నారని తెలిపారు. 

వరదలతో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న జనాలకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని గుర్తుచేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ చంద్రబాబుతో పాటు ప్రభుత్వం మొత్తం ప్రజలతోనే ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.

  • Loading...

More Telugu News