Space Ship: క్షేమంగా దిగిన బోయింగ్ స్టార్ లైనర్.. వ్యోమగాములను అక్కడే వదిలేసి వచ్చిన స్పేస్ షిప్

Boeing Starliner Spaceship Returns To Earth Without Astronauts

  • న్యూమెక్సికోలో సేఫ్ గా ల్యాండైందని నాసా వెల్లడి
  • సునీతా విలియమ్స్ ను ఐఎస్ఎస్ కు చేర్చిన స్పేస్ క్రాఫ్ట్
  • తిరిగి తీసుకురాలేక ఖాళీగా తిరిగి వచ్చిన వైనం

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9:30 గంటలకు న్యూమెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్ లో ల్యాండయింది. స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్ మోర్ లను తిరిగి తీసుకురాలేక వదిలేసి వచ్చింది. సాంకేతిక లోపాల కారణంగా వ్యోమగాముల భద్రతను దృష్టిలో పెట్టుకుని నాసా ఈ స్పేస్ షిప్ ను ఖాళీగా రప్పించింది. దీంతో వారం రోజుల షెడ్యూల్డ్ టూర్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకూ వెయిట్ చేయాల్సి వస్తోంది.

ఆది నుంచి అన్నీ ఆటంకాలే..
బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి ఆది నుంచి అన్నీ ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రయోగానికి అన్నీ సిద్ధం చేశాక చివరి క్షణంలో పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తీసుకుని అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. వారం రోజుల తర్వాత తిరిగి బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో వ్యోమగాములను ఆ స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి తీసుకురావడం క్షేమం కాదని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరో స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి, బోయింగ్ స్టార్ లైనర్ ను ఖాళీగా రప్పించారు. తాజాగా ఈ స్పేస్ షిప్ భూమికి చేరుకుంది. వ్యోమగాములు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగిరానున్నారు.

More Telugu News