Monfalcone: ఈ నగరంలో క్రికెట్‌పై బ్యాన్.. కాదని బ్యాట్ పడితే భారీ జరిమానా!
- ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ నగరంలో క్రికెట్‌పై నిషేధం
- అక్కడ ఎవరైనా క్రికెట్ ఆడితే రూ. 9,325 జరిమానా
- ఆట స్థలం కోసం నిధులు లేవన్న నగర మేయర్ సిసింట్
- పైగా క్రికెట్ ఆడే సమయంలో బంతి తగిలితే పెద్ద ప్రమాదమంటూ మేయర్ వాదన
మన దగ్గర క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు కనిపించదు. ఇక క్రికెట్ ఆడే దేశాల్లో ఈ ఆట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇంతకుముందు కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాపితమవుతోంది. క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్ వచ్చిన తర్వాత నుంచి ఈ గేమ్‌పై చాలా ఆసక్తి పెరిగింది.
అయితే, తాజాగా ఇటలీలోని ఓ నగరం మాత్రం క్రికెట్‌ను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎవరైనా ఈ కట్టుబాటును ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఉత్తర ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ అనే నగరం ఇలా క్రికెట్ ఆడడాన్ని నిషేధించింది. అక్కడ ఎవరైనా క్రికెట్ ఆడితే రూ. 9,325 (100 యూరోలు) జరిమానా విధిస్తామని మితవాద రాజకీయ పార్టీకి చెందిన నగర మేయర్ అన్నా మారియా సిసింట్ ప్రకటించారు.
ఇక ఇటలీలోని మోన్‌ఫాల్కోన్ అనే నగరం ప్రకృతి అందాలకు నెలవు. అడ్రియాటిక్ సముద్రపు ఒడ్డున గల ఈ పట్టణం చాలా చూడముచ్చటగా ఉంటుంది. 30 వేలకు పైగా జనాభా ఉంది. నివాసితులలో మూడింట ఒక వంతు మంది విదేశీ పౌరులు. వీరిలో చాలా మంది బంగ్లాదేశ్ ముస్లింలే ఉంటారట.
క్రికెట్‌పై నిషేధం ఎందుకంటే..?
క్రికెట్ పిచ్ తయారీకి పెద్దమొత్తంలో డబ్బులు కావాలి. పైగా మ్యాచ్‌ల నిర్వహణకు ఓ చిన్నపాటి స్థలం అయినా అవసరం. కానీ, పిచ్ తయారీకి ఆ నగరం మున్సిపల్ ఖజానాలో నిధులు లేవు. స్టేడియం నిర్మాణానికి అవసరమైన భారీ స్థలంగానీ మోన్‌ఫాల్కోన్‌లో లేదు. పైగా క్రికెట్ ఆడే సమయంలో బంతి తగిలితే పెద్ద ప్రమాదమే. అందుకనే మేయర్ అన్నా మరియా సిసింట్ క్రికెట్‌ను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో బ్యాన్ విధించారు. అలాగే బంగ్లాదేశీయులను మోన్‌ఫాల్కోన్‌లో క్రికెట్ ఆడేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా మేయర్ సిసింట్ తెలిపారు.