Vinesh Phogat: వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరడంపై తీవ్రంగా స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ చీఫ్

WFI chief hits out at Vinesh and Punia political debut

  • ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యం కలిగించలేదన్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్
  • వీరిద్దరు కాంగ్రెస్ ఆడిన ఆటలో పావుగా మారారని విమర్శ
  • ఈ రెజ్లర్లు తమ తీరు ద్వారా క్రీడలకు నష్టం చేశారని మండిపాటు

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ సంజయ్ సింగ్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వారు కాంగ్రెస్‌లో చేరడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదన్నారు. 

ఈ మేరకు ఆయన ఏఎన్ఐ మీడియా సంస్థతో మాట్లాడుతూ... వీరిద్దరూ ప్రముఖ రెజ్లర్లు అని, కానీ వారు కాంగ్రెస్ ఆడిన ఆటలో పావులుగా మారారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆనాడు రెజ్లర్ల ప్రకంపనలకు ఎవరు ఆజ్యం పోశారో ఇప్పుడు స్పష్టంగా అర్థమైందన్నారు.

నాటి ప్రేరేపిత నిరసనల కారణంగా దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిరసనలకు కాంగ్రెస్ మద్దతు ఉందని స్పష్టంగా తేలిపోయిందన్నారు. కాంగ్రెస్, ఆ రెజ్లర్లు దేశద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వారి కారణంగా మనం ఆరు పతకాలను కోల్పోయామన్నారు. ఈ రెజ్లర్ల ద్వయం క్రీడలకు ఎంతో నష్టం చేశారని విమర్శించారు. వారిద్దరు ఇప్పుడు తమ రాజకీయ రంగును చూపిస్తున్నారని, కానీ ఆ నిరసన సమయంలోనే తమ రంగును చూపించాల్సిందన్నారు.

వారు అధికారికంగా ఈ రోజు తమ రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఉండవచ్చు... కానీ దీనికి పునాది ఆ రోజు నుంచి (నిరసనలు తెలిపిన సమయం) కొనసాగుతోందన్నారు. తమకు న్యాయం కోరుతూ ఆ రెజ్లర్లు చేసిన ఉద్యమం అంతా రాజకీయ ప్రేరేపితమని తేలిపోయిందని, వారి వెనుక కాంగ్రెస్ ఉందని అర్థమవుతోందన్నారు. దీపేందర్ హుడా వెనుక ఉండి అంతా నడిపించాడని ఆరోపించారు.

ఈ ఇద్దరు రెజ్లర్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటే చాలాకాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. కానీ వారు తమ రాజకీయ అజెండా ముసుగులో ఓ ప్రణాళికతో ముందుకు సాగారని విమర్శించారు. తద్వారా క్రీడలకు నష్టం చేశారని విమర్శించారు.

తమ పోరాటాన్ని 'సడక్' నుంచి 'సంసద్'కు తీసుకు వెళతామన్న వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యలపై సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ దుష్ట ఆలోచనలను దేశం అర్థం చేసుకుంటోందన్నారు. రెజ్లర్లు కూడా తాము మోసపోయామని త్వరలో గుర్తిస్తారన్నారు.

  • Loading...

More Telugu News