Vinayaka Chavithi: గణేశుడి మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

TG CM Revanth Reddy wishes on Vinayaka Chavithi

  • రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
  • హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన
  • రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచన

వాడవాడలా వెలిసే గణేశ్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వినాయకుని మండపాలకు తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తుందని ముఖ్యమంత్రి ఇదివరకు ప్రకటించారు. 

ఖైరతాబాద్ గణేశుడికి సీఎం తొలి పూజలు

ఖైరతాబాద్ గణేశుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తొలి పూజ ఉంటుంది. ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు.

More Telugu News