Gautam Gambhir: హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gautam Gambhir is more aggressive says Rishab Pant

  • గంభీర్ దూకుడుగా ఉంటాడన్న స్టార్ క్రికెటర్
  • గెలవాల్సిందే అనే పక్షం వైపు మాత్రమే ఉంటాడని వ్యాఖ్య
  • మాజీ కోచ్ ద్రావిడ్ మాత్రం అత్యంత సమతుల్యత పాటించాడని అభిప్రాయపడ్డ పంత్

టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ పదవీకాలం జులై నెలలో మొదలైంది. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌‌లు రూపంలో ఆయన కోచింగ్ ప్రారంభమైంది. అయితే ఆ సిరీస్‌లు ముగిసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌ల రూపంలో టీమిండియా తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. ఈ సిరీస్‌తో హెడ్ కోచ్ గంభీర్‌కు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కోచ్‌ గౌతమ్ గంభీర్‌ స్వభావం గురించి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ మాట్లాడాడు.

గౌతీ భాయ్ ఎక్కువ దూకుడుగా ఉంటాడని, గెలవాల్సిందే అనే వైపు మాత్రమే ఆయన ఉంటారని పంత్ అన్నాడు. కానీ మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక మనిషిగా, కోచ్‌గా చాలా సమతుల్యత పాటించారని, దాని వల్ల మంచి, చెడు రెండూ జరగొచ్చని పంత్ అన్నాడు. క్రికెట్‌లో సానుకూలతలు ఉండవచ్చునని, అయితే సానుకూలతలు, ప్రతికూలాలపై దృష్టి పెట్టాలా వద్దా అనేది వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. కోచ్‌గా సరైన సమతుల్యతను గుర్తించి, మెరుగుపరచుకోవాలని విశ్లేషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ విధానమని అభిప్రాయపడ్డాడు. ‘జియో సినిమా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో అతిపెద్ద మార్పు ఏమిటి?, అది భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది?’’ అని యాంకర్ ప్రశ్నించగా పంత్ ఈ సమాధానం ఇచ్చాడు.

ఇక త్వరలోనే ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకోబోమని పంత్ చెప్పాడు. సిరీస్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆటగాళ్లు తమను తాము మెరుగుపరుచుకోవాలని అన్నాడు. పాకిస్థాన్‌ను స్వదేశంలో 2-0 తేడాతో బంగ్లాదేశ్ చిత్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పంత్ ప్రస్తావించాడు. కాగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు, కాన్పూర్‌ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది.

  • Loading...

More Telugu News