Virender Sehwag: నా పిల్లల వయసు 14, 16 సంవత్సరాలు: వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీమిండియా కోచ్ అయితే 8-9 నెలలు పిల్లలకు దూరంగా ఉండాల్సి ఉంటుందన్న మాజీ దిగ్గజం
- పిల్లలకు సాయంగా ఉండాల్సి ఉందని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్
- ఐపీఎల్ అయితే 2-3 నెలల్లో ముగిసిపోతుందని వ్యాఖ్య
టీమిండియా ప్రధాన కోచ్ పదవిని స్వీకరించడానికి తాను ఆసక్తిగా లేనని, దానికంటే ఐపీఎల్‌లో ఒక టీమ్‌కు కోచింగ్ బాధ్యతలు ఆఫర్ చేస్తే పరిశీలిస్తానని మాజీ దిగ్గజ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మనసులో మాట చెప్పాడు.
ఇందుకు గల కారణాలను అతడు వివరించాడు. ‘‘భారత క్రికెట్ జట్టు కోచ్‌గా కాకుండా ఐపీఎల్‌లో కోచింగ్ అవకాశం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తాను. భారత జట్టు ప్రధాన కోచ్‌గా మారితే మళ్లీ రోటీన్ లైఫ్‌నే కొనసాగించాల్సి ఉంటుంది. భారత జట్టు కోసం మళ్లీ గత 15 ఏళ్లు మాదిరిగా ఉండాల్సి ఉంటుంది. ఏడాదిలో 8-9 నెలలు ఇంటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. నా పిల్లలు వయసు 14, 16 ఏళ్లు. వారికి నేను సాయంగా ఉండాలి’’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.
తన కొడుకుల్లో ఒకరు ఓపెనింగ్ బ్యాటర్, మరొకరు ఆఫ్ స్పిన్నర్ అని సెహ్వాగ్ తెలిపాడు. తాను వారికి క్రికెట్ పరంగా సాయం చేయాలని, వారితో సమయం గడపాలని చెప్పాడు. తాను టీమిండియా హెడ్ కోచ్ అయితే పిల్లలకు దూరంగా గడపడం తనకు అతిపెద్ద సవాలు అవుతుందని, అలా ఉండలేనని, అందుకే ఐపీఎల్‌లో కోచ్ లేదా మెంటార్ బాధ్యతలు అందుబాటులో ఉంటే తాను చేపట్టగలనని క్లారిటీ ఇచ్చాడు. ‘అమర్ ఉజాలా’ అనే హిందీ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
కాగా టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండడం ఇష్టం లేక కోచ్ పదవీకాలం పొడిగింపు ఆఫర్‌ను తిరస్కరించారు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌లో తన మాజీ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌కు మెంటార్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ సంవత్సరానికి కేవలం 2-3 నెలలు మాత్రమే ఉండడంతో ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ద్రావిడ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల్లో ఉంటే ఏడాదికి 10 నెలలు ఇంటికి దూరంగా గడపాల్సి ఉంటుందని చెప్పాడు.