BCCI: వెళ్లిపోతున్న జై షా... మరి, బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో...?

bcci annugal general meeting will be held on september 29

  • బీసీసీఐ నూతన కార్యదర్శి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ
  • ఐసీసీఐ చైర్మన్ గా ఎంపికైన బీసీసీఐ సెక్రటరీ జై షా
  • ఈ నెల 29న బీసీసీఐ వార్షిక 93వ జనరల్ కౌన్సిల్ సమావేశం

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపిక కావడంతో ఆయన స్థానంలో ఎవరు ఎంపిక అవుతారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐసీసీ చీఫ్ గా జై షా ఎంపికై వారం రోజులు గడుస్తున్నా బీసీసీఐ నూతన కార్యదర్శిగా ఎవరు ఎంపిక అవుతారు అనే దానిపై ఉత్కంఠ ఇంత వరకూ వీడలేదు. ఈ తరుణంలోనే బీసీసీఐ వార్షిక సమావేశం తేదీ ఖరారయింది. బెంగళూరు వేదికగా 93వ జనరల్ మీటింగ్ ఈ నెల 29న జరగనుంది. 

ఈ సమావేశంలోనే బీసీసీఐ నూతన కార్యదర్శి ఎంపిక ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, అదేమీలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ద్వారానే కొత్త సెక్రటరీ నియామకం జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేయడంతో 29న జరిగే సమావేశంలో కొత్త సెక్రటరీ నియామకం ఉండదని తేలిపోయింది. అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చ నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నిని ఐసీసీలో ఇకపై బీసీసీఐ తరపున ప్రతినిధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ లో బీసీసీఐ ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేయడం, వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు అంబుడ్స్ మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.  
 
మరో పక్క జై షా స్థానంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా ఎంపిక అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో రోహన్ జైట్లీ స్పందించారు. ఆ వార్తలను ఆయన ఖండించారు. సెక్రటరీ రేసులో తాను లేనని స్పష్టం చేస్తూ తనపై వస్తున్నవి అన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News