Padi Kaushik Reddy: ప్రభుత్వం నా ఫోన్‌ను ట్యాప్ చేస్తోంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Padi Koushik Reddy alleges phone tapping

  • ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని ఆరోపణ
  • రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ
  • తెలంగాణలో 40 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్న ఎమ్మెల్యే

తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. అదీ ఏకకాలంలో జరగలేదన్నారు. తన నియోజకవర్గంలో ఓడిపోయిన వారు చెక్కులు పంచుతుండటం విడ్డూరమన్నారు.

పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల కోసం తాను ఓ 'బ్లాక్ బుక్‌'ను రెడీ చేశానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. 

ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్ పెంపుపై తాము ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే హైకోర్టుకు వెళతానని హెచ్చరించారు.

More Telugu News