Bhadrachalam: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి ప్రవాహం

godavari rising at bhadrachalam and first warning issued

  • భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ 
  • గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం
  • దవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల 37వేల క్యూసెక్కులు సముద్రంలోకి

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 41 అడుగుల నీటిమట్టం నమోదు కాగా..బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి యాత్రికుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇలాగే వరద ప్రవాహం పెరుగుతుంటే ఈ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

మరో పక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగచ్చని అంటున్నారు. తాజాగా కురిసిన వర్షాల కారణంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కాగా, ఈ ఏడాది జులై 27న భద్రాచలం వద్ద 53.9 అడుగుల మేర వరద రావడంతో అప్పట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ సమయంలో గోదారి తీర ప్రాంతం అతలాకుతలం అయింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా, మరోసారి నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పెరుగుతోంది. దవళేశ్వరం కాటర్ బ్యారెజ్ వద్ద నుండి 8లక్షల 37వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలవుతోంది.

  • Loading...

More Telugu News