Fahadh Faasil: ఓటీటీ ట్రాక్ పైకి .. దడపుట్టించే మిస్టరీ థ్రిల్లర్!

Irul Movie Update

  • మలయాళ మూవీగా రూపొందిన 'ఇరుల్' 
  • మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సినిమా 
  • 2021లో ఓటీటీలో విడుదల 
  • ఈ నెల 6 నుంచి ఆహా తమిళలో స్ట్రీమింగ్ 
  • త్వరలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి


మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ 'ఇరుల్'. 

మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీరాగ్ సాజీ సంగీతాన్ని సమకూర్చాడు. ఫహాద్ ఫాజిల్ .. దర్శనా రాజేంద్రన్ .. సౌబిన్ షాహిర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2021 ఏప్రిల్ 2న ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీ లో అడుగుపెడుతోంది. 

ఆహా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 6వ తేదీనుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇదే నెలలో తెలుగులోను ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. మూడే మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరగడం ఈ కథలోని ప్రత్యేకత.

కథలోకి వెళితే .. ఒక రచయిత తన ప్రియురాలితో కలిసి సరదాగా కారులో ఒక ట్రిప్ వేస్తాడు. ఒక అటవీ ప్రాంతంలో ఆ కారు ట్రబుల్ ఇస్తుంది. దాంతో ఇద్దరూ అయోమయంలో పడిపోతారు. సాయం కోసం చుట్టూ చూస్తున్న వారికి దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. దాంతో ఇద్దరూ ఆ ఇంటికి వెళతారు. ఆ ఇల్లు ఎవరిది? అక్కడ ఏం జరుగుతుంది? అనేది కథ. 

More Telugu News