Mahesh Babu: తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు

Hero Mahesh Babu announced Rs 50 Laksh for Each Telugu states amid Rain floods

  • ఏపీ, తెలంగాణలకు కలిపి రూ.1 కోటి విరాళం అందించిన సూపర్ స్టార్
  • ఇరు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్‌లకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నట్టు వెల్లడి
  • ప్రభుత్వ ప్రయత్నాలకు అందరూ సహకారం అందించాలని పిలుపు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా అతలాకుతలం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆంధప్రదేశ్‌లో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం పట్టణాలు మునుపెన్నడూ ఎరుగని వరదలతో తల్లడిల్లిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. 

దీంతో తెలుగు సినీ సెలబ్రిటీలు భారీ ఆర్థిక విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చేరారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఆయన రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు.

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు మహేశ్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తాను అభ్యర్థిస్తున్నానని, మనమంతా ఈ సంక్షోభాన్ని అధిగమించి మరింత బలంగా పుంజుకోవాలని అభిలాషిస్తున్నట్టు మహేశ్ బాబు పేర్కొన్నారు.


More Telugu News