Harish Rao: అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లండి... కేంద్రాన్ని నిలదీద్దాం: రాష్ట్ర ప్రభుత్వానికి హరీశ్ రావు సూచన

Harish Rao lashes out at state and central government

  • అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి సాయంపై కేంద్రాన్ని నిలదీద్దామన్న హరీశ్ రావు
  • వర్షాలు, వరదలతో 30 మంది చనిపోతే 15 మంది చనిపోయినట్లు చెబుతున్నారని ఆగ్రహం
  • వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారన్న మాజీమంత్రి

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. అందరం కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని సాయంపై నిలదీద్దామని సూచించారు. 

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... వర్షాలు, వరదలతో 30 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం 15 అని చెబుతోందని మండిపడ్డారు. చనిపోయిన వారి సంఖ్యను కూడా తక్కువ చూపిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సాగర్ ఎడమ కాలువకు గండి పడిందన్నారు. వేలాది ఎకరాలు నీటమునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారన్నారు. నిత్యావసరాలు, వివిధ డాక్యుమెంట్లు, పుస్తకాలు కొట్టుకుపోయాయని తెలిపారు. 

వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎందుకు పంపించలేదో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి తక్షణమే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షం తగ్గి రెండు రోజులు అయినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదన్నారు. మంచినీరు, ఆహారం కూడా సరఫరా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News