KTR: చంద్రబాబు ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది... రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో: కేటీఆర్

6 rescue helicopters and 150 rescue boats being used by neighbouring AP says KTR

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపాటు
  • ఏపీ సర్కారు 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపడుతోందన్న కేటీఆర్
  • తెలంగాణలో ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో? అని ఎద్దేవా

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

పొరుగున ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోందని, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం కాపాడింది 'బిగ్ జీరో' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపాటు

వరదల నేపథ్యంలో సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరదలో ఖమ్మంలో రాణి గారు, వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. మధిర నుంచి వారి బంధువులు గజఈతగాళ్లని రప్పించి వారే ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే... ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది ప్రాణాలను కాపాడారన్నారు. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులు, చివరికి దేవుడే దిక్కు అని చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిలదీశారు. 

ప్రతిపక్షాలు ఎన్ని ప్రజా సమస్యలు ఎత్తిచూపినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీఛార్జ్ చేస్తారా? సిగ్గు తెచ్చుకోండి... సీఎంగారూ! అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News