Telangana: మున్నేరు వాగు వరదతో వేల కోట్ల నష్టం జరిగింది: తెలంగాణ మంత్రులు
- 85 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నమోదైన నీటిమట్టం
- హెలికాప్టర్ తెప్పించే ప్రయత్నం చేస్తే వాతావరణం అనుకూలించలేదన్న మంత్రి
- వరదల్లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామని వెల్లడి
ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు వరదల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం 35 అడుగుల మేర నీటిమట్టం నమోదు కాగా... మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిందన్నారు.
మున్నేరు వాగులోనూ, ఇతర చోట్ల వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్‌ను తెప్పించే ప్రయత్నం చేశామని, కానీ వాతావరణం అనుకూలించలేదని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామన్నారు. బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
బాధితులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. వరదలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో బాధితులకు అండగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో మున్నేరు వాగు ఇలా ప్రమాదకరస్థాయిలో ప్రవహించలేదన్నారు. చేతనైతే సూచనలు చేయాలి తప్ప రెచ్చగొట్టడం సరికాదన్నారు.
కనీవినీ ఎరుగని స్థాయిలో మున్నేరువాగు ప్రవహిస్తోందని మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలో పాత ఖమ్మంలో 47 సెంటీమీటర్ల వర్షం కురిసిందని గుర్తు చేశారు. రెండంతస్తుల భవంతులు కూడా నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి నేవీ హెలికాప్టర్ తెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వాతావరణం అనుకూలించలేదన్నారు. వరదల వల్ల పాలేరులో ఇద్దరు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో ఊహించని నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నష్టం అంచనాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని... ప్రజలకు అండగా ఉంటామన్నారు.