CM Revanth Reddy: భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రం అత‌లాకుత‌లం.. మృతుల కుటుంబాలకు రూ.5 ల‌క్ష‌ల‌ చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం రేవంత్!

CM Revanth Reddy Review On Heavy Rains And Floods

  • రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు
  • వ‌ర‌ద‌ల కార‌ణంగా జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్తం
  • వ‌ర‌ద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం 
  • వ‌ర‌ద‌ల వ‌ల్ల చనిపోయిన కుటుంబాల‌కు ఆర్థిక సాయం రూ. 4ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల‌కు పెంపు

తెలంగాణ‌లో గ‌త రెండు రోజులుగా ఎడ‌తెరిపిలేకుండా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా వ‌ర‌ద‌నీళ్లే క‌నిపిస్తున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. భారీ వానల కార‌ణంగా రాష్ట్ర‌మంతా అత‌లాకుత‌ల‌మైంది. ఈ క్ర‌మంలో వ‌రద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. అన్ని కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. దీనికోసం క‌మాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. 

ఇక భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని ఎనిమిది పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. కాగా, భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన‌ వరదల వ‌ల్ల‌ చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్న‌ట్లు రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల‌ను ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాల‌ని అన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాల‌ని చెప్పారు. 

ఈ క్ర‌మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు. వ‌ర‌ద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

More Telugu News