AP Rains: అర్ధరాత్రి బోటులో వరద ప్రభావిత ప్రాంతాల్లో వద్దువద్దంటున్నా చంద్రబాబు పర్యటన

Chandrababu visits rain affected areas in Vijayawada till early morning 4am

  • తెల్లవారుజామున 4 గంటల వరకు చంద్రబాబు పర్యటన
  • అర్ధరాత్రి బోటులో ప్రయాణం ప్రమాదమని భద్రతా సిబ్బంది వారించినా వినిపించుకోని సీఎం
  • బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చి ఆహార ప్యాకెట్లు అందించిన చంద్రబాబు
  • దుర్గగుడి ద్వారా 50 వేలమందికి పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేయాలని ఆదేశం
  • ప్రైవేటు హోటళ్లతో మాట్లాడి లక్షమందికి ఆహారం రెడీ చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం
  • కాసేపట్లో మరోమారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో చంద్రబాబు రాత్రంతా మెలకువగా ఉండి పర్యటించారు. నిన్న ఉదయం అజిత్‌సింగ్‌నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి రెండోసారి అజిత్‌సింగ్‌నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. బోటులో అర్ధరాత్రివేళ ప్రయాణం ప్రమాదమని భద్రతా సిబ్బంది వారించినా చంద్రబాబు వినిపించుకోలేదు. తెల్లవారుజామున 4 గంటల వకు సుడిగాలి పర్యటన చేశారు. సెల్‌ఫోన్ కెమెరా లైట్ల వెలుతురులో అరగంట పాటు పర్యటించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఆహార ప్యాకెట్లు అందజేశారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాటి హుద్‌హుద్ విలయం, నేటి విపత్తు వేర్వేరని, ఇక్కడ నీరు సమస్యగా ఉందని పేర్కొన్నారు. బోట్లలో వెళ్తే తప్ప బాధితుల వద్దకు చేరుకోలేకపోతున్నామని, నీరు క్రమంగా తగ్గుతోందని చెప్పారు.

వరదల్లో చిక్కుకున్న అందరినీ రక్షిస్తామని, ఎన్‌డీఆర్ఎఫ్ బోట్లతో ఆపరేషన్ ప్రారంభిస్తామని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు విశ్రాంతి తీసుకున్నారు. మరి కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు మరోమారు పర్యటించనున్నారు.

లక్షమందికి ఆహారం
కనకదుర్గమ్మ ఆలయం ద్వారా వరద బాధితులకు ఆహారం తయారు చేసి అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, విజయవాడలోని ప్రైవేటు హోటళ్ల యజమానులతో మాట్లాడి లక్షమందికి ఆహారం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News