Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా బాలయ్యకే సాధ్యం... అన్ స్టాపబుల్ @ 50

Balakrishna 50 years in film industry

  • నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ
  • 'తాతమ్మ కల' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
  • సొంత స్టైల్, ట్రెండ్ తో దూసుకుపోయిన నటసింహం
  • రాజకీయాల్లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్
  • బాలయ్య 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న టాలీవుడ్

నందమూరి బాలకృష్ణ... ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. 'జై బాలయ్య' అనే నినాదం... వారిలోని ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ... ఏనాడూ వెనుతిరిగి చూసుకోలేదు. నటుడిగా ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. హీరోగా కొన్నేళ్లు కొనసాగడమే కష్టమైతే... ఇన్నేళ్లుగా బాలయ్య హీరోగా కొనసాగుతూనే ఉండటం ఆయన స్టార్ డమ్ కు నిదర్శనం. 

రాజకీయాల్లో సైతం ఓటమి ఎరుగని నేతగా బాలకృష్ణ నిలిచారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళుతున్నారు. "చరిత్ర సృష్టించాలన్నా... దాన్ని తిరగరాయాలన్నా నాకే సాధ్యం" అని బాలయ్య అంటుంటారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
 
1960 జూన్ 10 బాలకృష్ణ జన్మించారు. పేరు బాలకృష్ణ అయినా... ఇంట్లో అందరూ బాలయ్య అనే పిలుస్తారు. తన తండ్రి ఎన్టీఆర్ సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల... చిన్నప్పటి నుంచి ఆయనతో బాలయ్య గడిపిన సమయం తక్కువనే చెప్పుకోవాలి. 1974లో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు బాలయ్య సినీ ఆరంగేట్రం చేశారు. 

ఎన్టీఆర్ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన 'తాతమ్మ కల' చిత్రంలో తొలిసారి బాలయ్య నటించారు. ఈ సినిమాలో భానుమతి మునిమనవడి పాత్రను ఆయన పోషించారు. తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్న బాలకృష్ణ త్వరలోనే హీరోగా మారిపోయారు. 1984లో వచ్చిన 'సాహసమే జీవితం' సినిమాతో హీరోగా మారారు. అప్పటి నుంచి అగ్ర హీరోగా ఆయన ప్రస్థానం కొనసాగుతూ ఉంది. 

కెరీర్లో కొన్ని డిజాస్టర్లు వచ్చినా తనదైన శైలిలో వాటిని అధిగమించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగారు. ఇండియాలో 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. 
 
ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలో కొనసాగడం అంత ఈజీ కాదు. తన తండ్రి ప్రభావం తనపై పడకుండా బాలయ్య తనకంటూ ఒక స్టైల్, ఒక  ట్రెండ్ సృష్టించుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కంటి చూపుతో చంపేస్తా... ఒక్కవైపే చూడు, రెండోవైపు చూడాలనుకోవద్దు... ఇలాంటి పంచ్ డైలాగులు బాలయ్య సినిమాల్లో కోకొల్లలు. 

తొడ కొడితే టాటా సుమోలు గాల్లోకి ఎగరాలన్నా, రైలు వెనక్కి వెళ్లిపోవాలన్నా అది బాలయ్యకే సాధ్యం. మాస్ సినిమాలు, ఫ్యాక్ష్యన్ చిత్రాలతో బాలయ్య చెలరేగిపోయారు. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఫ్యాక్షన్ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ రోజుల్లో పౌరాణిక చిత్రాలు చేసే ధైర్యం ఏ హీరోకు లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఆ ధైర్యం బాలయ్య మాత్రమే చేయగలరు. ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేయడం కూడా బాలయ్యకే సాధ్యం. 

కరోనా మహమ్మారి పంజా విసిరిన తర్వాత సినిమాలను విడుదల చేయడానికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు వెనకడుగు వేస్తున్న సమయంలో... టాలీవుడ్ లో ఆత్మస్థైర్యం నింపిన హీరో బాలయ్య. ఎంతో ధైర్యంగా ఆయన తన ‘అఖండ’ చిత్రాన్ని విడుదల చేశారు. సెన్సేషనల్ హిట్ కొట్టిన ఆ చిత్రం ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, సత్తా చాటింది. ఆ తర్వాత ఇతర హీరోలు కూడా ధైర్యంగా తమ సినిమాలను విడుదల చేశారు. 
 
తన కెరీర్లో ఉత్తమ నటుడిగా బాలకృష్ణ మూడు నంది పురస్కారాలతో పాటు, పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. 2001లో వచ్చిన 'నరసింహనాయుడు', 2010లో వచ్చిన 'సింహా', 2014లో వచ్చిన 'లెజెండ్' చిత్రాలకు గాను ఆయన ఉత్తమ నటుడు పురస్కారాలను అందుకున్నారు. తన తల్లి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఆసుపత్రికి ఛైర్మన్ గా వ్యవహరిస్తూ ఆయన క్యాన్సర్ బాధితులకు సేవ చేస్తున్నారు. ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు.

నటుడిగా బాలకృష్ణ 50 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. బాలయ్య 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమ ఈ సాయంత్రం హైదరాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News