Actor Jayasurya: లైంగిక వేధింపుల ఆరోపణలపై జయసూర్య ఏమన్నారంటే..?
- తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన నటుడు.. న్యాయపోరాటం చేస్తానని వెల్లడి
- తన పుట్టిన రోజును బాధాకరంగా మార్చారంటూ ఇన్ స్టాలో పోస్ట్
- అబద్ధం వేగంగా వ్యాపిస్తుంది కానీ చివరకు నిజమే గెలుస్తుందంటూ వ్యాఖ్య
‘మనసాక్షి లేని వారికి తప్పుడు ఆరోపణలు చేయడం సులభం.. కానీ తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవడం వేధింపులలాగే బాధిస్తుందనే విషయం వారు తెలుసుకుంటారని భావిస్తున్నా’ అంటూ మలయాళ నటుడు జయసూర్య పేర్కొన్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని, వాటిపై న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు. ఈ విషయంలో తన లీగల్ టీమ్ ఇప్పటికే పని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. తన పుట్టినరోజును బాధాకరంగా మార్చారని వాపోతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నానని, త్వరలోనే కేరళకు తిరిగి వస్తానని జయసూర్య వెల్లడించారు.
మలయాళ సినీ ఇండస్ట్రీలో వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రిపోర్టు బయటకు వచ్చాక పలువురు నటీమణులు, ఇండస్ట్రీలోని ఇతర మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో జయసూర్యపై రెండు కేసులు నమోదయ్యాయి.
మద్దతుగా నిలబడ్డ వారికి థ్యాంక్స్..
‘పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు.. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తా. ఈ ఆరోపణలు నన్నూ, నా కుటుంబాన్ని, నా సన్నిహితులను బాధించాయి. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలుస్తున్న వారికి థ్యాంక్స్. తప్పుడు ఆరోపణలు చేయడం ఈజీ, వాటిని ఎదుర్కొనే వారికి కలిగే బాధ వేధింపులకు తక్కువేమీ కాదు. అబద్ధం వేగంగా వ్యాపించవచ్చు కానీ చివరకు నిజమే గెలుస్తుంది’ అంటూ జయసూర్య ఇన్ స్టాలో పోస్టు పెట్టారు.