G Jagadish Reddy: నీ కంటే చిన్నవాడు సీఎం పదవి గుంజుకుంటే చేతకాని దద్దమ్మవు: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి తీవ్రవ్యాఖ్యలు

Jagadish Reddy hot comments on Uttam Kumar Reddy

  • రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను తమ పార్టీకి ముడిపెడుతున్నాడని విమర్శ
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
  • రేవంత్ రెడ్డిని అనడం చేతకాక కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారని మండిపాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనాల్సిన మాటలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీకి ముడిపెడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై నిన్న మంత్రి చేసిన విమర్శల మీద జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగలు మీరేనని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డిని అనడం చేతకాని మంత్రి కేసీఆర్‌పై పడి ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారు మీవాళ్లయితే, కేసీఆర్ పదేళ్లు ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భాషను మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. నీకంటే వెనుక వచ్చినవాడు, నీకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి పదవి గుంజుకుంటే చేతకాని దద్దమ్మగా ఉత్తమ్ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రేవంత్‌కు పడ్డ చివాట్లు మీకూ తప్పవని ఉత్తమ్‌ను హెచ్చరించారు. ఆయన ఇలాగే తిడుతుంటే చీవాట్లు పడతాయని, కానీ ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. 

రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణలో ఎక్కడకు వెళ్లినా అధికార పార్టీ వారి కమీషన్లు, దోపిడీ గురించే ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. తమ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా నీటిని, విద్యుత్‌ను అందించామన్నారు. కానీ ఇప్పుడు నీటి కోసం, విద్యుత్ కోసం ధర్నాలు జరుగుతున్నాయన్నారు. 

సాగునీటి కోసం ధర్నాలు కొనసాగితే యాసంగి నాటికి కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. బాధ్యతలు చేతకాకుంటే మంత్రి పదవిపై ఆయన పునరాలోచన చేయాలన్నారు. కాళేశ్వరం నుంచి నీటిని అందించకుంటే కాంగ్రెస్ వారికి రైతులతో దెబ్బలు తప్పవన్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్ త్వరలో కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News