Jonty Rhodes: అందుకే రవీంద్ర జడేజా బెస్ట్‌ ఫీల్డర్: జాంటీ రోడ్స్

Ravindra Jadeja is the best fielder of modern cricket says Jonty Rhodes

  • మైదానంలో ఏ చోట‌నైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం జ‌డ్డూ సొంత‌మ‌న్న రోడ్స్
  • అందుకే ఆధునిక క్రికెట్‌లో అత్యుత్త‌మ ఫీల్డ‌ర్ జ‌డేజానే అంటూ వ్యాఖ్య‌
  • బంతిని ఫీల్డ‌ర్ ఎంత త్వరగా చేరుకున్నాడ‌నే విష‌య‌మే ఫీల్డింగ్‌లో ది బెస్ట్ అన్న మాజీ క్రికెట‌ర్
  • ఈ విష‌యంలో ఆధునిక క్రికెట్‌లో జ‌డ్డూను ఎవ‌రు అధిగ‌మించ‌లేరంటూ కితాబు

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాపై ద‌క్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్, ప్రో క్రికెట్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ జాంటీ రోడ్స్ ప్ర‌శంస‌లు కురిపించాడు. మైదానంలో ఏ చోట‌నైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం జ‌డ్డూ సొంత‌మ‌న్నాడు. అందుకే ఆధునిక క్రికెట్‌లో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ అని జాంటీ రోడ్స్ పేర్కొన్నాడు.

"ఫీల్డర్‌గా నేను ఎప్పుడూ మెచ్చుకునే ఇద్దరు ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా. వారిద్దరూ అత్యుత్తమ భారతీయ ఫీల్డర్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆధునిక క్రికెట్ విష‌యానికి వ‌స్తే, ఉత్తమ ఫీల్డర్ క‌చ్చితంగా రవీంద్ర జడేజానే. 

నేను అతనిని అత్యుత్తమ ఫీల్డ‌ర్‌గా పరిగణించడానికి కారణం అతను ఏ స్థానంలోనైనా ఫీల్డింగ్ చేయగలడు. అతను మిడ్ వికెట్, లాంగ్ ఆన్, షార్ట్ కవర్ ఇలా మైదానం న‌లుమూల‌ల్లో ఎక్క‌డైనా ఉండొచ్చు. కానీ, అత‌నివైపు వెళ్లే బంతి వ‌ద్ద‌కు చాలా వేగంగా వెళుతుంటాడు. 

బంతి అతని వద్దకు వెళ్లినప్పుడు బ్యాటర్ ప‌రుగు తీయ‌డానికి భయపడతాడు. అందుకే బంతిని పట్టుకోవడం లేదా విసిరేయడం కంటే ఫీల్డింగ్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బంతి వద్దకు ఎంత త్వరగా చేరుకున్నారు అనేదే. ఈ విష‌యంలో జడేజా ది బెస్ట్‌" అని ప్రో క్రికెట్ లీగ్ ట్రోఫీ, జెర్సీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో జాంటీ రోడ్స్ అన్నారు.

ఇక ఈ ఏడాది జూన్‌లో బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైన‌ల్‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. ఈ విజ‌యం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కలిసి జడేజా కూడా అంత‌ర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే, భార‌త్ త‌ర‌ఫున‌ వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో జ‌డ్డూ ఆడ‌నున్నాడు. 

ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ర‌వీంద్ర జ‌డేజా... సెప్టెంబరులో స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం తిరిగి భారత జట్టులోకి వస్తాడని స‌మాచారం. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు, సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో రెండో టెస్టు జరగనుంది.

  • Loading...

More Telugu News