Engineering Students: సీఎం చంద్రబాబు ఆదేశాలతో హాస్టల్ లో తనిఖీలు... ఆందోళన విరమించిన ఇంజనీరింగ్ విద్యార్థినులు

Engineering students calls off agitation in Gudlavalleru

  • గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం
  • చంద్రబాబు ఆదేశాలతో హాస్టల్ లో తనిఖీలు చేపట్టిన పోలీస్ టీమ్
  • పోలీసుల తనిఖీలతో సంతృప్తి చెందిన విద్యార్థినులు
  • హాస్టల్ లో ఉండేందుకు అంగీకారం

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజిలో అమ్మాయిల హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాల కలకలం సద్దుమణిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. 

విద్యార్థినుల సమక్షంలోనే హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించే పరికరాలతో పోలీసులు హాస్టల్ లోని అణువణువు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీ పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. హాస్టల్ లో ఉండేందుకు అంగీకరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ, ఆరోపణలు చేశారన్న కారణంతో విద్యార్థినులపై కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని స్పష్టం చేశారు. వేధిస్తే ధైర్యంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. 

కాగా, గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజికి రేపు (ఆగస్టు 31) సెలవు ప్రకటించారు. ఎల్లుండి ఆదివారం కాగా, రెండ్రోజుల సెలవుల నేపథ్యంలో విద్యార్థినులను వారి తల్లిదండ్రులు హాస్టల్ నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు. 

అంతకుముందు, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజిని సీఐ రమణమ్మ నేతృత్వంలోని పోలీస్ టీమ్ పరిశీలించింది. మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో కలిసి సీఐ రమణమ్మ హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు. పది మంది విద్యార్థినులతో కలిసి బాత్రూంలలో నిశితంగా పరిశీలించారు. ఎక్కడైనా హిడెన్ కెమెరాలు ఉన్నాయేమోనని వెతికారు. 

తనిఖీల అనంతరం దర్యాప్తు బృందం మంత్రి కొల్లు రవీంద్రను, ఎస్పీని కలిసి వివరాలు తెలిపారు. తనిఖీల నేపథ్యంలో అమ్మాయిల హాస్టల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హాస్టల్ లోని ప్రతి ఫ్లోర్ కు ఇన్చార్జిలుగా మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు వెల్లడించారు. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు.

More Telugu News