RS Praveen Kumar: దుర్గం చెరువులోని తిరుపతిరెడ్డి ఇంటికి వెళ్లి ఎందుకు కూల్చడం లేదు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Why HYDRA not demolishing Tirupati Reddy house RSP question

  • హైడ్రా అంటే అందరికీ ఒకే న్యాయం పాటించాలని సూచన
  • నోటీసులు ఇవ్వకుండానే పాలమూరులో ఇళ్లను కూల్చేశారని ఆగ్రహం
  • ఇళ్లు కూలిన దృశ్యాలు చూసి కలిచివేశాయన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబ్ నగర్‌లో పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులు... హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైడ్రా అంటే అందరికీ ఒకే న్యాయం పాటించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడాలనుకోవడం మంచిదే కానీ... ఈ పేరుతో పేదలకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం ఉండవద్దన్నారు.

నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా దుర్గం చెరువులోని అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. పాలమూరు అంధుల కాలనీలో అధికారులు ఇళ్లు కూల్చిన దృశ్యాలు తనను కలిచివేశాయన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి నిద్ర ఎలా పడుతుందని ప్రశ్నించారు. పోలీసు బలంతో అంధుల కాలనీని కూల్చిన అధికారులు, అదే పోలీసులతో వెళ్లి తిరుపతిరెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదో చెప్పాలన్నారు.

రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు నిర్వీర్యమయ్యాయన్నారు. తొమ్మిది నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న రేవంత్ రెడ్డి కనీసం గురుకులాలపై సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, ప్రతికార పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజురీయింబర్సుమెంట్స్ చెల్లించకపోవడంతో... ఫీజులు కట్టడం లేదని యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదన్నారు.

పేద విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి కోపం ఎందుకో చెప్పాలన్నారు. విద్యార్థి భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం దానిని పక్కన పెట్టేసిందన్నారు. ఖైదీల తిండి కోసం రోజుకు రూ.83 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల కోసం మాత్రం రూ.37 మాత్రమే ఖర్చు చేస్తోందని విమర్శించారు. గురుకుల విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News