Joe Root: జో రూట్ మరో టెస్ట్ శతకం.. ఆ ముగ్గురి రికార్డులు బ్రేక్.. డేంజర్‌లో సచిన్ రికార్డ్!
- టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దూకుడు
- లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో శతకం బాదిన రూట్
- ఇది అతని టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ
- ఈ శకతంతో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాల రికార్డు బద్దలు
- సచిన్ అత్యధిక టెస్టు రన్స్ (15,921) రికార్డుకు కేవలం 3,647 పరుగుల దూరం రూట్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. క్రీజులో నిలదొక్కుకోవడమే ఆలస్యం అవలీలగా సెంచరీలు బాదేస్తున్నాడు. ప్రస్తుతం లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రూట్ మరో శతకం నమోదు చేశాడు.
ఇది అతడి టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ. తద్వారా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ అవతరించాడు. దీంతో గతంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పేరిట ఉన్న అత్యధిక శతకాల (33) రికార్డును సమం చేశాడు.
అలాగే ఈ సెంచరీతో అతడు మరో ముగ్గురు క్రికెటర్ల అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, స్టీవ్ వాలను రూట్ అధిగమించాడు. ఈ ముగ్గురు టెస్టుల్లో చెరో 32 శతకాలు సాధించారు. దీంతో జో రూట్ (33) తాజాగా వారిని దాటినట్టైంది.
ఇక అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రూట్ ఇటీవలే టెస్టుల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా అతడు 145 మ్యాచుల్లో 265 ఇన్నింగ్స్ ఆడి , 50.71 సగటుతో 12,274 రన్స్ చేశాడు. ఇందులో 5 డబుల్ సెంచరీలు, 33 శతకాలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి.
ప్రమాదంలో సచిన్ రికార్డ్..
ఇక పీక్ ఫామ్‌లో ఉన్న ఈ ఇంగ్లీష్ బ్యాటర్.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేలానే కనిపిస్తున్నాడు. లిటిల్ మాస్టర్ తన టెస్టు కెరీర్‌లో మొత్తంగా 15,921 రన్స్ చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం జో రూట్ 12,274 పరుగులతో సచిన్‌కు కేవలం 3,647 పరుగుల దూరంలోనే ఉన్నాడు. అలాగే టెస్టుల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ సచిన్ 51 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. రూట్ కూడా ప్రస్తుతం ఉన్న ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టెండూల్కర్ రికార్డును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే..
సచిన్ టెండూల్కర్ - 51
జాక్వెస్ కల్లిస్ - 45
రికీ పాంటింగ్ - 41
కుమార్ సంగక్కర - 38
రాహుల్ ద్రవిడ్ - 36
సునీల్ గవాస్కర్ - 34
మహేల జయవర్ధనే - 34
బ్రియాన్ లారా - 34
యూనిస్ ఖాన్ - 34
ఆలిస్టర్ కుక్- 33
జో రూట్ - 33
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ల లిస్ట్..
సచిన్ టెండూల్కర్- 15,921
రికీ పాంటింగ్- 13,378
జాక్వెస్ కల్లిస్- 13,289
రాహుల్ ద్రవిడ్- 13,288
అలిస్టర్ కుక్- 12,472
కుమార్ సంగక్కర- 12,400
జో రూట్- 12,274