Chandrababu: స్వార్ద రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్ లు జగన్ కు అవసరం లేదు: పేర్ని నాని

YCP Ex minister perni nani fires on chandrababu

  • బాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం కావాలన్న పేర్ని నాని 
  • అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని వ్యాఖ్య 
  • పార్టీ మారిన వాళ్లకు 2029 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారన్న మాజీ మంత్రి
  •  

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వార్ధ రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్‌లు జగన్ కు అవసరం లేదని అన్నారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం కానీ అదే జగన్ గెలవాలంటే జనం సాయం చాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి 2029 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు. 

కేవలం జగన్ మూలంగా ఒక మత్స్యకారుడు పెద్దల సభలో అడుగుపెట్టగలిగాడని నాని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు.. వాటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అతి పెద్ద ఆషాడభూతి అని అన్నారు. నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తు చేశారు. ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటని విమర్శించారు. చంద్రబాబును చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. 

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసిన తర్వాత రావాలని చెబుతున్న చంద్రబాబు.. గతంలో 23 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇటీవల కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుండి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు.

  • Loading...

More Telugu News