Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
- బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న సీఎం
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
- తాము అంతరాత్మ ప్రకారమే విధులు నిర్వహిస్తామన్న కోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం వల్లే, కవితకు బెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటమా? అని ప్రశ్నించింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్... ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది. సీఎం చేసిన వ్యాఖ్యలు... ప్రజల మెదళ్లలో అనుమానాలకు తావిస్తుందన్నారు. తమ ఆదేశాలపై విమర్శలు వచ్చినా తామేమీ బాధపడమని, కానీ తాము తమ అంతరాత్మ ప్రకారమే విధులను నిర్వర్తిస్తుంటామని పేర్కొంది.
సీఎం అంటే బాధ్యతగా ఉండాలని, ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని పేర్కొంది. "రాజకీయ నాయకులను సంప్రదించి మేం ఆదేశాలు ఇస్తామా? ఎవరి వ్యాఖ్యలనూ పట్టించుకోం.. మా విధిని నిర్వహిస్తాం... ప్రమాణపూర్వకంగా పని చేస్తాం. ఎవరి పనుల్లోనూ జోక్యం చేసుకోం. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా? వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి అభిప్రాయం ఉంటే ఓటుకు నోటు కేసు విచారణను రాష్ట్రం బయటే నిర్వహిద్దాం" అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.