Reliance Jio: జియో వినియోగదారులకు తీపి కబురు.. 100 జీబీ ఉచిత స్టోరేజీ
- దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలను ప్రారంభించనున్న జియో
- వెల్‌కం ఆఫర్ కింద యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజీ
- ఈ మేరకు రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన
ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలను ప్రారంభించనున్న జియో తన వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వెల్‌కం ఆఫర్ కింద యూజర్లకు 100జీబీ ఉచిత స్టోరేజీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం జరిగిన రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా దాదాపు 35 లక్షల మంది వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. "డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకువస్తున్నాం. వెల్‌కం ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించాలని నిర్ణయించాం. ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకునే వారికి సరసమైన ధరల్లోనే అందించడం జరుగుతుంది.
ఏఐ అనేది కొందరికి మాత్రమే అందే లగ్జరీగా మిగిలిపోకూడదని మేం భావిస్తున్నాం. ఏఐ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలనేదే మా ఉద్దేశం. కృత్రిమ మేధను అందిపుచ్చుకుని జియో వినియోగదారుల కోసం ఏఐ ప్లాట్‌ఫామ్ జియో బ్రెయిన్ మరింత విస్తరిస్తున్నాం. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తాం" అని ముకేశ్ అంబానీ చెప్పుకొచ్చారు.