Harish Rao: రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారు: హరీశ్ రావు

Harish Rao fires at Revanth Reddy over Loan Waiver

  • రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదు... "చీట్" చాట్ అని ఎద్దేవా
  • రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తామన్న హరీశ్ రావు
  • కొండారెడ్డిపల్లి వెళ్లి రుణమాఫీపై అడుగదామా? అని సవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో పాటు వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదని... "చీట్" చాట్ అని ఎద్దేవా చేశారు. లేనివి ఉన్నట్లుగా చెప్పి మోసం చేయడం ఆయనకు అలవాటే అన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తే రుణమాఫీపై నిలదీస్తామన్నారు.

రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. కొండారెడ్డిపల్లి, సిద్దిపేటకు వెళ్లి రుణమాఫీపై రైతులను అడుగుదామా? అని సవాల్ చేశారు. రుణమాఫీ కాలేదని ప్రతిరోజూ మీ మంత్రులే చెబుతున్నారన్నారు.

ఆగస్ట్ 15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది తన సవాల్ అని, అలా చేశారా? అని ప్రశ్నించారు. రుణమాఫీపై తన సవాల్ ఏమైందో రైతులే చెబుతారన్నారు. వ్యవసాయమంత్రి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ కృతజ్ఞత సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్ గాంధీ రావడం లేదన్నారు.

వాల్మీకి కుంభకోణంపై ఆగ్రహం

వాల్మీకి కుంభకోణంలో పట్టపగలే నిలువు దోపిడీ జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ కుంభకోణంపై సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. ఈ కుంభకోణంపై తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ అంశంలో ఈడీ విచారణను కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి కాబట్టే కుంభకోణంపై ఈడీ దాడులు జరగడం లేదన్నారు. విచారణ జరిపి కుంభకోణంపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ అంశంపై తాము ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు..

  • Loading...

More Telugu News