Gautam Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన‌ అదానీ.. రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అగ్ర‌స్థానం

Gautam Adani tops 2024 Hurun India Rich List 2024 Surpasses Mukesh Ambani

  • భార‌తదేశ‌పు అత్యంత ధ‌న‌వంతుడిగా గౌతమ్ అదానీ 
  • తాజాగా వెలువ‌డిన‌ హురున్ ఇండియా-2024 ధ‌న‌వంతుల జాబితాలో అగ్ర‌స్థానం
  • రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానం  
  • 1,539 మంది వ్యక్తులు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నార‌న్న నివేదిక‌
  • 2024లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చిన‌ట్లు వెల్ల‌డి

బిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా అవ‌త‌రించారు. తాజాగా వెలువ‌డిన‌ 2024 హురున్ ఇండియా ధ‌న‌వంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెన‌క్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు.

ఇక రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. కాగా, అదానీ స్థానం భారతీయ వ్యాపార రంగంలో ఆయన ఆధిపత్య ఉనికిని చాటిందనే చెప్పాలి. ఆయ‌న సంప‌ద ఏడాది కాలంలోనే ఏకంగా 95 శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం.  

అటు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత‌ శివ్ నాడార్ రూ. 3.14 లక్షల కోట్లతో మూడో స్థానం ద‌క్కించుకున్నారు. అలాగే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్. పూనావాలా రూ. 2.89 లక్ష‌ల కోట్ల సంప‌ద‌తో నాలుగో స్థానంలో నిలిచారు.  

గత ఏడాదిలో మ‌న ద‌గ్గ‌ర‌ ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చిన‌ట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. ఇండియాలో ప్ర‌స్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే 75 మంది పెరిగిన‌ట్లు నివేదిక తెలిపింది.

అలాగే 1,539 మంది వ్యక్తులు ఇప్పుడు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది పెరిగార‌ని రిపోర్ట్ పేర్కొంది. అంతేగాక‌ సగటు సంపద 25 శాతం మేర‌ పెరిగింది.

ఇక రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ సెక్టార్‌లకు చెందిన వారు ఈ బిలియనీర్ల‌ జాబితాలోకి అత్యధికంగా కొత్తగా ప్రవేశించినట్లు నివేదిక వెల్ల‌డించింది. ఇక ధ‌న‌వంతుల‌ జాబితాలో ఉన్న అతి పిన్న వయస్కుడి వయస్సు కేవలం 21 సంవత్సరాలు కావ‌డం గ‌మ‌నార్హం.

.

  • Loading...

More Telugu News