Puja Khedkar: నాపై అనర్హత వేటు వేసే అధికారం యూపీఎస్సీకి ఎక్కడిది?: పూజ ఖేడ్కర్
- తప్పుడు పత్రాలతో మోసం చేశారంటూ పూజపై యూపీఎస్సీ వేటు
- ఐఏఎస్ హోదా తప్పించిన ఉన్నతాధికారులు
- అనర్హత వేటుపై కోర్టుకెక్కిన మాజీ ఐఏఎస్
ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వేటుకు గురైన మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె వాదిస్తున్నారు. ఒకసారి సెలక్ట్ చేసి, ప్రొబెషనరీ ఆఫీసర్ గా ఆర్డర్ జారీచేశాక సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవడానికి యూపీఎస్సీకి ఎలాంటి అధికారం ఉండదని పూజ చెప్పారు. ప్రస్తుతం తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్ర మానవ వనరుల శాఖ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
అంగవైకల్యంతో బాధపడుతున్నానంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి పరీక్షల్లో రిజర్వేషన్ పొందిన పూజా ఖేడ్కర్ పై యూపీఎస్సీ ఇటీవల చర్యలు తీసుకుంది. అనర్హత వేటు వేయడంతో పాటు ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. తప్పుడు పత్రాలతో పాటు తన పేరు మార్చుకుని యూపీఎస్సీ ఎగ్జామ్ కు పరిమితికి మించి రాసిందని ఆరోపించింది. జనరల్ అభ్యర్థులకు ఆరు సార్లు పరీక్ష రాసే అవకాశం ఉండగా.. పూజ ఖేడ్కర్ తన పేరులో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ పరిమితి కన్నా ఎక్కువ సార్లు పరీక్షకు హాజరయ్యారని చెప్పింది. తన పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లలో కూడా మార్పులు చేయడం వల్ల పూజ చేసిన మోసాన్ని గుర్తించలేకపోయామని యూపీఎస్సీ వెల్లడించింది.