Radha Yadav: వరదల్లో చిక్కుకున్న భారత మహిళా క్రికెటర్.. కాపాడిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు!
![Star Team India Spinner Radha Yadav Rescued by NDRF amid Gujarat Rains](https://imgd.ap7am.com/thumbnail/cr-20240829tn66d00e3260ea1.jpg)
- భారీ వర్షాల కారణంగా గుజరాత్ అతలాకుతలం
- వరద నీరు పోటెత్తడంతో రాష్ట్ర ప్రజల తీవ్ర ఇక్కట్లు
- విశ్వమిత్రి నదికి వరద పోటెత్తడంతో వడోదరలో పరిస్థితులు దారుణం
- వరదల్లో చిక్కుకున్న మహిళా స్పిన్నర్ రాధా యాదవ్ ఫ్యామిలీ
- కాపాడిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలకు ధన్యవాదాలు తెలిపిన భారత క్రికెటర్
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీరు పోటెత్తడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కనీస అవసరాలకు నోచుకోని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక వడోదరలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విశ్వమిత్రి నదికి వరద పోటెత్తింది. దీంతో నది కట్టలు తెంచుకుంది. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్, స్పిన్నర్ రాధా యాదవ్ ఫ్యామిలీ చిక్కుంది. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఆమె కుటుంబాన్ని కాపాడాయి.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. "వడోదరలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మేమంతా అందులో చిక్కుకుపోయాం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మమ్మల్ని రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలకు ధన్యవాదాలు" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
నాలుగు రోజులుగా భారీ వర్షాలు.. 28 మంది మృతి
గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 18వేల మంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌తో ఇప్పటికే ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అవసరమైన సాయం చేస్తామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.