Kadambari Jetwani: సంచలన విషయాలు వెల్లడించిన ముంబయి నటి కాదంబరి జెత్వానీ

Kadambari Jetwani sensational revealations about harassment


కృష్ణా జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత (కుక్కల విద్యాసాగర్) ముంబయికి చెందిన ఓ నటితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా, తన పలుకుబడితో ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేయడం, ఆమెను వదిలించుకునేందుకు ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల సహకారం తీసుకోవడం, ఇందులో పలువురు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం... ఏపీ రాజకీయాల్లో ఈ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చేసింది. ఈ వ్యవహారంలో సజ్జల పాత్ర కూడా ఉందన్న కథనాలతో అందరి దృష్టి ఈ వ్యవహారంపై పడింది.

కాగా, ఆ నటి పేరు కాదంబరి జెత్వానీ. గుజరాత్ కు చెందిన ఆమె నటిగానూ, మోడల్ కోఆర్డినేటర్ గానూ పనిచేస్తోంది. వైసీపీ నేత జోలికి రాకుండా చేసేందుకు గాను ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ముంబయి నుంచి కృష్ణా జిల్లాకు తీసుకువచ్చి ఓ గెస్ట్ హౌస్ లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో, కాదంబరి జెత్వానీ ఓ తెలుగు న్యూస్ చానల్లో డిబేట్ కు హాజరైంది. తమకు ప్రాణహాని ఉందని, తమకు పోలీసు రక్షణ కావాలంటూ, ఈ తప్పుడు కేసుల నుంచి న్యాయపరమైన రక్షణ కూడా కావాలంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని ఆరోపించింది. 

దేశవ్యాప్తంగా తనకు రక్షణ కావాలని అన్నారు. ఆంధ్రాలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు పెట్టారా? అని యాంకర్ ప్రశ్నించగా...  ఆంధ్రాలో తనకు ట్రైలర్ మాత్రమే చూపించారని, సినిమా ఇంకా మిగిలే ఉందని ఆమె ఏడుస్తూ బదులిచ్చారు. తాను ఒక ఒంటరి యువతినని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలనని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. 

2014లో తాను తెలుగు సినిమా రంగంలో పనిచేశానని, ఆ సమయంలోనే విద్యాసాగర్ తో పరిచయం ఏర్పడిందని, అతడు ఖరీదైన గిఫ్టులతో తనను ప్రలోభాలకు గురిచేశాడని కాదంబరి జెత్వానీ ఆరోపించింది. ఓ కేసులో అతడు మూడేళ్లు తప్పించుకుని తిరిగాడని, ఒకరోజు తన అపార్ట్ మెంట్ లో ప్రత్యక్షమై ఫోన్ అడిగాడని, కొన్ని కాల్స్ చేసుకుంటానని చెప్పడంతో భయపడ్డానని వెల్లడించింది. అతడిని పోలీసులు 2017లో అరెస్ట్ చేశారని తెలిపింది. 

కాగా, కొందరు వ్యక్తులు (పోలీసు అధికారులు!) తమ కుటుంబానికి చెందిన 10 ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లారని... అందులో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఆ వస్తువులను తిరిగి ఇవ్వలేదని అన్నారు. అంతేకాదు, తమ బ్యాంక్ అకౌంట్లను నిలిపివేయించారని, దాంతో తాము రోజు గడిచేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని భోరున విలపించింది. 

కాగా, జెత్వానీ వైద్య విద్యను అభ్యసించిందని, ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, తల్లి రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగిని అని సదరు చానల్ యాంకర్ వెల్లడించారు. 

సంబంధం లేని కేసులో, అధికార పార్టీలో ఉన్న నాయకుడి కోసం ఆమెను హింసించి, జైల్లో 45 రోజులు బంధించి, కుటుంబ సభ్యులను హింసించి, ఇంటిని ఇతర ఆస్తులను సీజ్ చేస్తే, రోజు గడిచేందుకు అప్పులు చేశామని ఆమె బాధపడుతోంది... ఆఫీసర్స్ వింటున్నారా? అంటూ సదరు యాంకర్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం కాదంబరి జెత్వానీ స్పందిస్తూ... తమ పట్ల వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News