Dawid Malan: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ గుడ్ బై

Dawid Malan Retires From International Cricket

  • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన డేవిడ్ మలన్
  • ఒకప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ అగ్ర‌స్థానంలో కొన‌సాగిన స్టార్ క్రికెట‌ర్‌
  • 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిల‌వ‌డంలో మలన్ కీరోల్
  • ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్ల‌లో ఆడి సత్తా చాటిన స్టార్ బ్యాట‌ర్‌

ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, ఆ త‌ర్వాత అన‌తికాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం ద‌క్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగాడు కూడా. 

2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిల‌వ‌డంలో మలన్ కీరోల్ పోషించాడు. ఇంగ్లండ్ తరఫున 62 టీ20లు ఆడిన అత‌డు 16 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. అటు 2022 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత మ‌ల‌న్ కేవలం 15 ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలతో వ‌న్డే క్రికెట్‌లోనూ స‌త్తా చాటాడు. మొత్తంగా ఆ జ‌ట్టు త‌ర‌ఫున 30 వ‌న్డేల్లో ప్రాతినిధ్యం వ‌హించాడు. అలాగే 22 టెస్టు మ్యాచ్ లు కూడా ఆడాడు. 

ఈ 37 ఏళ్ల టాప్ ఆర్డర్ బ్యాటర్ చివరిసారిగా 2023 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తరఫున బ‌రిలోకి దిగాడు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జరిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌లకు మ‌లన్‌కు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే, అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ బ్యాట‌ర్ ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నాడని తెలుస్తోంది. 

ఇటీవ‌ల ముగిసిన ది హండ్రెడ్ 2024 టైటిల్‌ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జ‌ట్టులో మ‌ల‌న్ స‌భ్యుడు. ద‌క్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ ఎస్ఏ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ ఏడాది ట్రోఫీ గెల‌వ‌డంలోనూ అత‌డు కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ జ‌ట్టు త‌ర‌ఫున 2021లో ఒక మ్యాచ్ ఆడాడు. 


  • Loading...

More Telugu News