Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy laid foundation to Telangana Talli Statue

  • రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు
  • భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
  • గత పాలకులు పదేళ్లుగా తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఆవేదన
  • డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటన

హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేత కె.కేశవరావు తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూమి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావించామని, కానీ సమయం లేదని తెలిపారు. కొన్ని రోజుల వరకు మంచి ముహుర్తాలు లేకపోవడంతో, ఇవాళ్టి ముహుర్తానికి భూమి పూజ చేశామని వెల్లడించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ స్వప్నం సాకారమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఆశయసిద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ఉద్యమం చెబుతోందని అన్నారు. ఇచ్చిన మాటను సోనియా  నిలబెట్టుకోవడం వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించిందని వివరించారు. కానీ, గత సర్కారు పదేళ్ల పాటు తెలంగాణ తల్లి ఊసే లేకుండా వ్యవహరించిందని, తెలంగాణ తల్లిని మరుగునపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

కాగా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన డిసెంబరు 9వ తేదీ అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని, ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

Revanth Reddy
Telangana Talli Statue
Foundation
Hyderabad
Congress
Telangana
  • Loading...

More Telugu News