Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ సర్వీస్!
- ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన కస్టమర్ కేర్ సేవలు
- ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లో అందుబాటు
- కస్టమర్ల మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఐవీఆర్ సిస్టం వారి భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుందన్న సంస్థ
భారతీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ కేర్ సర్వీసులను మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్ భాషలకే పరిమితమైన ఈ సేవలను ఇప్పుడు తెలుగుతో పాటు మరో ఏడు ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది.
తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్ కేర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ) సిస్టం, వారి భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుందని ఎయిరిండియా పేర్కొంది.
"భారతీయ భాషలలో బహుభాషా సపోర్ట్‌ను తీసుకురావడం అనేది మా ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. ఈ ప్రాంతీయ భాషలను మా కస్టమర్ సపోర్ట్ సర్వీస్‌లలోకి చేర్చడం ద్వారా మేము మా పరిధిని విస్తరించడమే కాకుండా మా కస్టమర్‌లతో సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకున్నట్టయింది. ఎయిరిండియాతో ప్రయాణికులందరినీ కలుపుకుపోయేలా చూస్తాం" అని ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు
ఇక ఇటీవల ఎయిరిండియా ఐదు కాంటాక్ట్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి ద్వారా తరచూ ప్రయాణించే వారికి, ప్రీమియం కస్టమర్లకు అన్ని వేళలా కస్టమర్ కేర్ సర్వీసులు అందిస్తామని సంస్థ తెలిపింది.