Naga Chaitanya: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్నించగా నాగచైతన్య సమాధానం ఇదే

Naga Chaitanya said that My father has told all the details regarding the demolition of N Convention


తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించారంటూ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు ఇటీవల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతపై ప్రముఖ సినీ నటుడు నాగార్జున కొడుకు, హీరో నాగ చైతన్య స్పందించాడు. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి నాన్న ‘ఎక్స్‌’ వేదికగా అన్ని వివరాలు చెప్పారని అన్నారు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడొద్దని అన్నారు. హిమాయత్‌నగర్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా నాగ చైతన్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది.

తన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. ‘హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా? అని ప్రశ్నించగా ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్యకు ఈ నెల 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.

ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. తండేల్‌లో తన పాత్ర అత్యంత సవాల్‌తో కూడుకున్నదని, ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. తన ప్రస్తుత లుక్‌ తండేల్‌ సినిమా కోసమేనని వెల్లడించారు. కాగా ఈ సినిమా చందూ మొండేటి డైరెక్షన్‌లో రూపొందుతోంది. 

More Telugu News