K Kavitha: కేసీఆర్ బిడ్డను... నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు: కవిత కంటతడి

Kavitha speech after releasing from jail

  • ఓ తల్లిగా ఐదున్నర నెలలు జైల్లో ఉండటం బాధగా ఉందని వ్యాఖ్య
  • ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక
  • ఫైటర్లం... చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామన్న కవిత

నేను కేసీఆర్ బిడ్డను... తెలంగాణ బిడ్డను... తప్పు చేసే ప్రసక్తే లేదు... అనవసరంగా జైలుకు పంపించి జగమొండిని చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 

తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఓ తల్లిగా ఐదున్నర నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. ఆ సమయం త్వరలోనే రాబోతుందన్నారు. 

తాను కేసీఆర్ బిడ్డనని... మొండిదాన్ని అని... మంచిదాన్ని అని వ్యాఖ్యానించారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి... ఎన్నో ఎత్తుపల్లాలను చూశానన్నారు. కానీ ఈసారి కుటుంబానికి దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 

తనకు, తన కుటుంబానికి అండగా ఉన్నవారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాము ప్రజాక్షేత్రంలో మరింత గట్టిగా పనిచేస్తామన్నారు. తాము ఫైటర్లమని... చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామన్నారు.
 

  • Loading...

More Telugu News