Jay Shah: ఐసీసీ నూతన చైర్మన్ గా జై షా ఏకగ్రీవ ఎన్నిక

Jay Shah elected as ICC New Chairman

  • గ్రెగ్ బార్ క్లే స్థానంలో ఐసీసీ పగ్గాలు అందుకోనున్న జై షా
  • డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్న జై షా పదవీకాలం
  • ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న షా

భారత క్రికెట్ రంగంలోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్ యవనికపైనా తనదైన ముద్ర వేసేందుకు జై షా సిద్ధమయ్యారు. జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే కొనసాగుతుండగా, ఆయన ఈ ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం జై షా ఐసీసీ పగ్గాలు అందుకోనున్నారు. 

జై షా 2019 నుంచి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2021 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఐసీసీ చైర్మన్ గా డిసెంబరు 1న బాధ్యతలు చేపట్టనున్నారు. 

ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే మూడోసారి పదవి చేపట్టరాదని నిర్ణయించుకోవడంతో, ఐసీసీ చైర్మన్ పదవికి జై షా ఒక్కరే రేసులో మిగిలారు. దాంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఐసీసీ నూతన చైర్మన్ గా ఎన్నికవడం పట్ల జై షా హర్షం వ్యక్తం చేశారు. ఐసీసీ బృందంతో, ఇతర సభ్య దేశాలతో కలిసి క్రికెట్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. 

గతంలో ఎన్ శ్రీనివాసన్ (2014-15), శశాంక్ మనోహర్ (2016-20) ఐసీసీ చైర్మన్లుగా వ్యవహరించగా... జగ్ మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012) ఐసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు ఈ వరుసలో జై షా ఐసీసీ చైర్మన్ పీఠం అధిష్ఠించనున్నారు. ఇంతజేసీ జై షాది చిన్న వయసే. ఆయన వచ్చే నెలలో 36వ ఏట అడుగుపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News