K Kavitha: కవితకు బెయిల్ వచ్చింది... బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలింది: మహేశ్ గౌడ్

Mahesh Goud talks about Kavitha bail issue

  • లిక్కర్ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్
  • కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందన్న బండి సంజయ్
  • బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందన్న మహేశ్ గౌడ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేత కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ కృషి వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ బీజేపీ నేత, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

అటు, కాంగ్రెస్ కూడా కవితకు బెయిల్ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ ఈ అంశంపై స్పందిస్తూ... కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. 

మొన్నటివరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని... కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. 

బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయిందని... కేటీఆర్, హరీశ్ లు ఢిల్లీలో బీజేపీ నేతలకు ఆపద మొక్కులు మొక్కారని వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి, కాళ్ల మీద పడి... కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. 

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని అన్నారు.

  • Loading...

More Telugu News