Garbage Tax: కడప మేయర్ ఇంటి ముందు చెత్తను విసిరేసిన ప్రజలు... వీడియో వైరల్!

People throw garbage at Mayor house in Kadapa

  • చెత్తపై పన్ను విధించిన గత వైసీపీ ప్రభుత్వం
  • తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తేస్తామన్న కూటమి
  • అప్పటివరకు చెత్త పన్ను చెల్లించవద్దని పిలుపు
  • కడపలో చెత్త పన్ను చెల్లించకపోవడంతో నిలిచిన చెత్త సేకరణ
  • తిరగబడిన ప్రజలు

గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను విధించిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను చెల్లించని వారి నుంచి చెత్తను సేకరించని ఉదంతాలు గతంలో చోటుచేసుకున్నాయి. తాజాగా, కడపలోనూ అలాంటి పరిణామం చోటుచేసుకోగా, ప్రజలు తిరగబడ్డారు. 

అసలేం జరిగిందంటే... తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాయి. చెత్త పన్ను చెల్లించవద్దని సూచించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, చాలా చోట్ల చెత్త పన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. దాంతో చెత్త సేకరణ నిలిచిపోయింది. 

ఈ నేపథ్యంలో, కడపలో చెత్త పన్ను చెల్లిస్తేనే చెత్తను తీసుకెళతామని, లేకపోతే ఎవరి ఇంటి వద్ద చెత్త వారి ఇంటి వద్దే ఉంటుందని మేయర్ సురేశ్ హెచ్చరించారు. అందుకు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చెత్త పన్ను చెల్లించవద్దని, చెత్తను తీసుకెళ్లి మేయర్, వైసీపీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు పారబోయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ క్రమంలో  ప్రజలు తమ ఇళ్ల నుంచి చెత్తను తీసుకువచ్చి మేయర్ ఇంటి ముందు విసిరేశారు. మేయర్ ఇంటి ముందు బైఠాయించి మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News