Kolkata Horror: కోల్‌కతా హత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్.. వైద్యురాలిపై దారుణం తర్వాత సెమినార్ హాల్‌లో సందీప్ ఘోష్ లాయర్.. వీడియో ఇదిగో!

New Viral Video Shows Sandip Ghoshs Associates In Seminar Hall Post Crime

  • ఘటన జరిగిన తర్వాత సెమినార్ హాల్‌లో సందడి
  • ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం జరిగి ఉంటుందన్న ప్రశ్నలు తెరపైకి
  • వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించాలన్న మాజీ పోలీసు అధికారి
  • పాలిగ్రాఫ్ టెస్టులో నిందితుడు చెప్పింది నిజమేనా? అంటూ ప్రశ్న 

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఘటన తర్వాత డాక్టర్ దేబాశిష్ సోమ్ (సందీప్ ఘోష్ సన్నిహితుడు, ఆర్‌జీ కర్ ఆసుపత్రి ఫోరెన్సెక్ శాఖకు చెందిన వైద్యుడు), పోలీసులు, ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లాయర్ శంతను డే, ఘోష్ పీఏ, ఆసుపత్రి ఔట్‌పోస్టు సిబ్బంది సెమినార్ హాల్‌లో కనిపించారు. వీరంతా ఏదో విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. అయితే, ఈ వీడియోలో బాధిత వైద్యురాలి మృతదేహం మాత్రం కనిపించలేదు. 

ఈ వీడియో ఇప్పుడీ ఘటనపై మరిన్ని అనుమానాలు, ప్రశ్నలకు తెరలేపింది. వీరందరూ కలిసి ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వారందరూ ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు? ఏం చర్చించుకున్నారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ వివరణ ఇస్తూ..  పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లారని, అది కూడా నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. మరి లాయర్ అక్కడ ఎందుకు ఉన్నాడన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఈ విషయం గురించి ఆసుపత్రి అధికారులు మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. 

మాజీ పోలీసు అధికారి పంకజ్ దత్తా మాట్లాడుతూ.. ఆ వీడియోలో కనిపిస్తున్న అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. దీనిని బట్టి సెమినార్ హాల్‌లో అంతకుముందు వైద్యురాలి మృతదేహం లేదేమోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. 

ఇదే నిజమైతే నిందితుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్టులో చెప్పిందే నిజం కావొచ్చని మరికొందరు చెబుతున్నారు. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లేసరికే అక్కడ వైద్యురాలి మృతదేహం ఉందని, అది చూసి భయంతో పారిపోయానని నిందితుడు లై డిటెక్టర్ టెస్టులో చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజా వీడియో వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News