Patnam Mahender reddy: ఈ చిన్నదాంట్లో కబ్జా చేయాల్సిన అవసరం నాకు లేదు.. ఫాంహౌస్ ఆరోపణలపై పట్నం మహేందర్ రెడ్డి

Patnam Mahender Reddy Press Meet

  • పట్టా భూమిలో, రూల్ ప్రకారమే కట్టుకున్నానని వివరణ
  • అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చాకే నిర్మించుకున్నట్లు వెల్లడి
  • నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే తానే కూల్చేస్తానని స్పష్టీకరణ

కొత్వాల్ గూడలోని తన ఫాంహౌస్ అక్రమ నిర్మాణమంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై మాట్లాడారు. కొత్వాల్ గూడలోని సర్వే నెం.13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమి ఉందని చెప్పారు. ఆ భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005 లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి, ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫాంహౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు.

తాత, తండ్రుల నుంచి తమది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ లేదని కావాలంటే మీడియా ప్రతినిధులు సహా ఎవరైనా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణల్లో నిజంలేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని వివరించారు.

రేవంత్ రెడ్డిపై ప్రశంసలు..
హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. హైడ్రా ఏర్పాటును ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు.

More Telugu News